ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి.. చంద్రబాబు సీరియస్ కామెంట్స్..!

Sunday, November 8th, 2020, 10:07:28 PM IST

Chandrababu_Naidu

వైసీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నంద్యాలలో అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుని మరణించడం విచారకరమని, సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారు అనేందుకు సలాం కుటుంబం ఆత్మహత్యే నిదర్శనమని అన్నారు.

నాడు శాసనమండలిలో సభ్యులందరిముందు చైర్మన్ షరీఫ్ గారిని మతం పేరుతో దూషించారని, రాజమండ్రిలో పదేళ్ళ ముస్లిం బాలికపై అత్యాచారయత్నం చేసిన వారిపై కేసు పెడితే కేసు వెనక్కు తీసుకోవాలని వైసీపీ నేతలు బాలిక తండ్రి సత్తార్ గారిపై ఒత్తిడి తేవడంతో ఆయన ఆత్మహత్య వరకు వెళ్ళారని గుర్తుచేశారు. అయితే ఈ రోజు చెయ్యని నేరాన్ని ఒప్పుకోమని అధికారులు వేధించడంతో ఒక నిండు కుటుంబం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అంటున్న ప్రభుత్వం, దీనికి ఏమని సమాధానం చెప్తుందని అన్నారు. నంద్యాల ఘటను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరి వీడాలని అన్నారు.