దళితులపై దాడి జరగని రోజు లేదు – చంద్రబాబు నాయుడు

Monday, August 31st, 2020, 07:20:11 AM IST


ఏపీలో రోజు రోజుకు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, దళితులపై దాడులు జరగకుండా ఒక్క రోజైనా గడుస్తుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఉన్మాదుల పాలన ఎలా ఉంటుందో ఈ దాడులే నిరూపిస్తున్నాయని అన్నారు. దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కూడా దౌర్జన్యంగా లాక్కుంటున్నారని, రెండు నెలలలో 2 జిల్లాలలో దళిత యువకులకు శిరోముండనం చేయడం ఘోరమని అన్నారు.

అయితే శిరోముండనం చేయడమే కాకుండా దానిని వీడియో తీయడం ఉన్మాద చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వ అండతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, దళితులపై దాడులతో జగన్‌కు రోజూ రక్తాభిషేకాలు జరుగుతున్నాయని కొత్తగా వైసీపీ నేతలు పాలాభిషేకాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు ఓటెసిన వారినే అణిచివేయాలని చూస్తుండడం దుర్మార్గం అని అన్నారు.