ఇలాంటి పాలకులు అరుదు.. జగన్ సర్కార్‌పై మండిపడ్డ చంద్రబాబు..!

Sunday, August 23rd, 2020, 01:35:27 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావించింది. అయితే రాజధానిని అమరావతి నుంచి తరలించకూడదని 250 రోజులుగా అమరావతి గ్రామాల రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 250 రోజులు అయ్యిందని దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ ఉద్యమాలు చాలా అరుదు అని ఇంత జరుగుతున్నా ఆందోళనకారుల బాధను వినడానికి ముందుకు రాని పాలకులు కూడా అరుదే అని జగన్ సర్కార్‌ని ఎద్దేవా చేశారు. అంతేకాదు వేలాది మంది ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపిందని మండిపడ్డారు.

ఉద్యమంలో 85 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులైనా ప్రభుత్వం తమాషా చూస్తోందని, రాజధాని అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న మా డిమాండ్‌కు వైసీపీ ముందుకు రాలేదంటే, 3 ముక్కల నిర్ణయానికి 13 జిల్లాల ప్రజల మద్దతు లేనట్టే అని అలాంటప్పుడు మొండిగా ముందుకు పోవడం నిరంకుశత్వమే అని అన్నారు. అమరావతి శంకుస్థాపనకు రాష్ట్రంలోని 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల్లో పవిత్ర మట్టి, పుణ్య జలాలు ప్రజలు ఊరేగింపుగా తెచ్చారంటేనే అమరావతిని రాజధానిగా అందరూ ఆమోదించారని, రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత 13 జిల్లాల ప్రజలపై ఉందని అన్నారు.