చెప్పేవన్ని అబద్ధాలు, చేసేవన్ని తప్పుడు పనులు.. జగన్‌పై చంద్రబాబు సీరియస్..!

Thursday, October 22nd, 2020, 01:14:03 AM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. నేడు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కరోనాలో ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండటం బాధాకరమని అన్నారు. కరోనా కారణంగా రైతులు, పేదలు, చేతివృత్తుల వారు ఆర్ధికంగా చితికిపోయారని అన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను వైసీపీ విస్మరించిందని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అని బతిమలాడితే ప్రజలు జగన్‌కు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు.

అయితే పదే పదే తప్పుడు పనులు చేస్తూ ఇదే చివరి ఛాన్స్‌గా చేసుకున్నాడని అన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం రాష్ట్రానికి తీవ్ర నష్టమని అన్నారు. జగన్ తన రివర్స్ పాలనతో రాష్ట్రాభివృద్దిని అంతా రివర్స్ చేశాడని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పేవన్ని అబద్ధాలు, చేసేవన్ని తప్పుడు పనులే అని దుయ్యబట్టారు. దోపిడీ చేయడమే జగన్ ఏకైక మార్గమని, రాష్ట్రాభివృద్ధికి గండికొట్టే పార్టీని చూడడం ఇదే మొదటి సారి అని అన్నారు.