జమిలీ ఎన్నికలకు సిద్దంగా ఉండాలి.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

Wednesday, December 16th, 2020, 06:27:09 PM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. రాజమండ్రి టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ కోరుతున్నా ఎన్నికలకు ప్రభుత్వం సిద్దంగా లేదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. వ్యాక్సిన్ వంకతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించాలని మరో జగన్నాటకానికి తెరలేపారని మండిపడ్డారు.

అయితే కరోనాకు డిసెంబర్ 25 నుంచి కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ అంటూ వైసీపీ నేతలు దొంగ ప్రచారాలు చేసుకుంటున్నారని అన్నారు. అయితే నిష్పాక్షికంగా స్థానిక ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయం వైసీపీకి పట్టుకుందని అందుకే ఎన్నికలకు సహకరించడం లేదని ఆరోపించారు. అయితే స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్దంగా ఉండాలని, తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ గెలిస్తేనే వైసీపీ అరాచకాలకు అడ్డుకట్టపడుతుందని అన్నారు. ఇక జమిలీ ఎన్నికలు కూడా ఎప్పుడొచ్చినా టీడీపీ నేతలు సిద్దంగా ఉండాలని కోరారు.