వైసీపీ పతనానికి పంచాయితీ ఎన్నికలే నాంది కావాలి – చంద్రబాబు

Saturday, January 23rd, 2021, 01:55:37 AM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కీలక సూచనలు చేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి ఈ పంచాయితీ ఎన్నికలు నాంది కావాలని అంతేకాకుండా వైసీపీ పతనానికి కూడా ఈ పంచాయితీ ఎన్నికలే నాంది కావాలని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శనిగా జగన్‌రెడ్డి మారాడని, ఏపీని అన్నివిధాలా నాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారని చంద్రబాబు విమర్శలు గుప్ప్పించారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయితీలలో అభ్యర్ధులు పోటీలో ఉండాలని, బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. పంచాయితీ ఎన్నికల కోడ్‌ నిన్నటి నుంచే అమల్లోకి వచ్చిందని వైసీపీ నేతల దౌర్జన్యాలకు పాల్పడితే మొబైల్ ఫోన్లలో రికార్డ్‌ చేసి అధికారులకు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. ఇకపోతే ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయం వైసీపీకి పట్టుకుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.