కళ్లుంటే వచ్చి చూడండి.. వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్..!

Thursday, December 17th, 2020, 03:55:24 PM IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. నేడు అమరావతి రైతులు ఏర్పాటు చేసిన జనభేరీ సభకు హాజరైన చంద్రబాబు నాయుడు రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న మహిళలు, రైతులు రియల్ ఎస్టేట్ వారని, వ్యాపారస్తులే శిబిరాలలో ఉన్నారని సీఎం జగన్, వైసీపీ నేతలు అంటున్నారని అయితే వైసీపీ నేతలకు నిజంగా కళ్లుంటే రైతులు చేస్తున్న ఉద్యమం దగ్గరకు వచ్చి చూస్తే శిబిరాలలో ఎవరున్నారో తెలుస్తుందని అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకుని రైతులకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.

అయితే జనభేరీ సభకు వచ్చిన వారికి కులమతాలు లేవని అందరిది రైతు కులమేనని చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను అవమానిస్తున్నారని, సీఎం హోదాలో ఉండి జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే రైతులందరికి బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని అమ్మవారు మూడోకన్ను తెరుస్తుందని రాక్షసులను అంతంచేస్తుందని చెప్పుకొచ్చారు. అమరావతి కంటే పవిత్రమైన రాజధాని ఇంకొకటి ఉంటుందా అని ప్రశ్నిస్తూ, ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.