వైసీపీ నేతలు కోట్లలో కమీషన్లు దండుకుంటున్నారు – చంద్రబాబు నాయుడు

Thursday, August 20th, 2020, 01:35:25 PM IST

Chandrababu-Naidu

వైసీపీ ప్రభుత్వ చేపట్టబోతున్న ఇళ్ళ స్థలాల పంపిణీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పేరుకు పేదలకు ఇళ్ళస్థలాల పథకం కానీ అది వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారిందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నివాసయోగ్యం కాని ముంపు ప్రాంతాలను ఎకరాకు 5 లక్షలు చేయని ఆవ భూములను ఎకరా 45 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు తమ కమీషన్లను కోట్లలో దండుకున్నారని ఆరోపించారు.

అంతేకాదు ఇలాంటి స్కామ్ లు రాష్ట్రమంతా చోటు చేసుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. ఈ పథకం పేదల కోసమా లేక ప్రజాధనాన్ని పార్టీ నేతలకు దోచిపెట్టే పథకమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ భూముల కొనుగోలుపై సమగ్ర దర్యాప్తు జరిపించి, ప్రజాధనాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.