అచ్చెన్న అరెస్ట్ పై చంద్రబాబు సీరియస్…జగన్ కక్ష సాధింపు కి పరాకాష్ట

Tuesday, February 2nd, 2021, 10:24:25 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ తో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు అచ్చెన్న ను అరెస్ట్ చేయడాన్ని.చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే బేశరుతు గా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే అక్రమ అరెస్ట్ కి సీఎం జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ చంద్రబాబు అన్నారు. హింసాకాండ పై ధ్వజమెత్తడమే అచ్చెన్న తప్పిదమా అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఈ మేరకు చంద్రబాబు నాయుడు వరుస ప్రశ్నలు సంధించారు. అవినీతి కుంభకోణాలు బయట పెట్టడమే నేరమా? దువ్వాడ శ్రీనివాస్ పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడు పై కేసు పెడతారా? ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించిందెవరు అంటూ మండిపడ్డారు. అయితే అచ్చెన్న అరెస్ట్ సీఎం జగన్ కక్ష సాధింపు నకు పరాకాష్ట అంటూ చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర పై పగబట్టి హింస, విధ్వంసాలు సృష్టిస్తున్నారు అని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే నిమ్మాడ లో గత నలభై ఏళ్లలో ఇటువంటి ఉద్రిక్తతలు లేవు అని అన్నారు. అయితే రామతీర్థం లో కూడా తన పై, కళా వెంకట్రావు పై, అచ్చెన్న పై తప్పుడు కేసులు పెట్టారు అంటూ చెప్పుకొచ్చారు.

చాలా మంది పై తప్పుడు కేసులు పెట్టారు అని, సబ్బం హరి ఇల్లు, గీతం వర్సిటీ లను ధ్వంసం చేశారు అంటూ మండిపడ్డారు.గతంలో కూడా 83 రోజులు అచ్చెన్న ను అక్రమం గా నిర్బంధించారు అని, ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని ఐదు జిల్లాల్లో తిప్పారు అంటూ చెప్పుకొచ్చారు. అవినీతి కుంభకోణాలు బయటపెట్టడమే నేరమా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వ్యవహారం పై మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తప్పదు అనే భయంతోనే అరెస్టులు అని,ఎన్ని కుట్రలు చేసిన ఎన్నికల్లో జగన్ కి ప్రజలు బుద్ది చెబుతారు అంటూ చెప్పుకొచ్చారు.