చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లో ఒకదానికొకటి ఢీ..!

Saturday, September 5th, 2020, 07:23:51 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో తెలంగాణలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఆయన కాన్యాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లో ఎస్కార్ట్ వాహనానికి ఆవు అడ్డుగా రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు.

దీంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా కాన్వాయ్‌లోని ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టింది. అయితే ఆ వెనుకే ఉన్న వాహనంలో చంద్రబాబు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనం ముందు భాగం బాగా దెబ్బతినడంతో వెంటనే భద్రతా సిబ్బంది మరో వాహనంలో చంద్రబాబు వెంట హైదరాబాద్ చేరుకున్నారు. అయితే చంద్రబాబుకు కానీ, భద్రతా సిబ్బందికి కానీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.