జగన్ పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలి – చంద్రబాబు నాయుడు

Tuesday, November 17th, 2020, 09:01:01 PM IST

తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు సీఎం జగన్‌ తీరుపై మండిపడ్డారు. ఏపీ ప్రజలను సీఎం జగన్ నమ్మించి ద్రోహం చేశారని అన్నారు. అమరావతిలో పనులు ఆపేయడం జగన్ చేసిన మొదటి ద్రోహమని, పోలవరం ప్రాజెక్టు పనులు నిర్లక్ష్యంగా ఆపేయడం రెండవ ద్రోహమని, ప్రత్యేక హోదా తెస్తానని నమ్మించి మోసం చేయడం జగన్ చేసిన మూడో ద్రోహమని ఆరోపించారు.

అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ బెదిరించి, తప్పుడు కేసులు పెట్టి, టీడీపీ నేతల నామినేషన్లను బలవంతంగా విత్‌డ్రాలు చేయించారని అందుకే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి, మళ్లీ తాజాగా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలపై దాడులకు అడ్డుకట్ట వేయాలంటే ఇదే మంచి సమయమని, సీఎం జగన్ పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.