“నాడు-నేడు” కార్యక్రమాన్ని ఒక ఫార్స్ గా మార్చడం శోచనీయం – చంద్రబాబు

Saturday, September 5th, 2020, 12:35:19 PM IST

నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయులందరికీ గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతాయుత పౌరులుగా బాల బాలికలను తీర్చిదిద్ది, దేశ భవిష్యత్తును తరగతి గదుల్లో నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉందని, అందుకే “గురుబ్రహ్మ”గా పోల్చి దైవ సమానులుగా ప్రవచించారని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అయితే డీఎస్సీ-2018 అభ్యర్థుల ఎంపిక పూర్తయి 9 నెలలు కావస్తున్నా 3,633 మందిని ఈ ప్రభుత్వం ఇంకా నిరీక్షణలోనే ఉంచడం బాధాకరమని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం “నాడు-నేడు” అనే కార్యక్రమాన్ని ఒక ఫార్స్ గా మార్చడం శోచనీయమని, ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోందని ఇప్పుడీ కరోనా పరిస్థితుల్లో మీరు, మీ కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, మన సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేలా ముందుజాగ్రత్తల గురించి విద్యార్ధులను, తద్వారా వాళ్ల తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని కోరుతున్నానని అన్నారు.