ప్రజారోగ్యంతో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

Thursday, May 6th, 2021, 07:05:18 PM IST

ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. దేశంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న 33 జిల్లాల జాబితాలో ఏపీకి చెందిన 7 జిల్లాలు ఉన్నాయని ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టిలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రజారోగ్యంతో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా ఇంతలా పెరిగిపోయిందని ఆరోపించారు. ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కరోనా పేషంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఓ బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము కరోనాపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంటే తనపైనే ప్రభుత్వం ఎదురు దాడికి దిగుతోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందని స్వయంగా వైసీపీ పార్టీ నేతలే రాజమండ్రిలో మాట్లాడుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అలసత్వానికి ఇంకెందరు బలికావాలని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అయితే వ్యాక్సిన్ సరఫరా చేయండి.. ప్రాణాలు కాపాడండి అన్న నినాదంతో ఈ నెల 8న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు.