అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసులు బెదిరిస్తున్నారు

Monday, February 8th, 2021, 05:02:57 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయం లో అధికార పార్టీ పై, పోలీస్ వ్యవస్థ పై ప్రతి పక్ష పార్టీ నేత, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసులు బెదిరిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు కి చెందిన టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు వ్యాఖ్యలు చేశారు.

పట్టణానికి చెందిన 26 మంది పార్టీ కార్యకర్తల పై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు అంటూ మండిపడ్డారు. ఎన్నికల అక్రమాలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యత వహించాలి అంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అయితే నామినేషన్లు వేసిన వారిని పోటీ నుండి తప్పుకోవాలని వేలం లో పాడిన అభ్యర్ధులు బెదిరిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ అక్రమాల పై ఎన్నికల కమిషనర్, డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక టీడీపీ నేతలు ఈ విషయం లో ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికార వైసీపీ పై న్యాయ పోరాటం చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.