బిగ్ న్యూస్: అందులో ఆంధ్ర ప్రదేశ్ 20 వ స్థానం లో ఉండటం విచారకరం – చంద్రబాబు

Friday, August 28th, 2020, 12:39:03 AM IST


నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఎగుమతుల సన్నద్ధత సూచీ 2020 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 20 వ స్థానం కి ఉండటం విచారకరం అంటూ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు అందుకు సంబంధించిన పలు ఫొటోలను ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అతి పొడవైన తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రం, కనీసం ఇతర 8 తీర ప్రాంత రాష్ట్రాలతో కూడా పోటీ పడలేక 7 వ స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని చంద్రబాబు నాయుడు తన ఆవేదన ను వ్యక్తం చేశారు.

అయితే ఈ లిస్ట్ లో ఆంధ్ర ప్రదేశ్ కి పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణ పై చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. పోర్టులు లేకున్నా తెలంగాణ 6 వ స్థానం లో ఉంటే, 11 మైనర్ పోర్టులు, 1 మేజర్ పోర్టు ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇలా దిగజారడం వైసీపీ ప్రభుత్వం వైఫల్యానికి ఇది నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు. తీరప్రాంత రాష్ట్రమైనా పాలసీ పరం గా ఏపీ పని తీరు నాసిరకం గా ఉంది అని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించడం కన్నా అవమానం ఏముంది అని చంద్రబాబు నాయుడు తెలిపారు.