రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా ఏపీ కి మరో అప్రదిష్ట మూటగట్టారు – చంద్రబాబు

Wednesday, October 28th, 2020, 12:56:35 PM IST

రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ అప్రదిష్ట మూటగట్టుకుంది అని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేడిల రాజ్యం లో రైతులకు బేడిలా అనే చర్చకు దేశవ్యాప్తంగా తెరదీసారు అని తెలిపారు. గత 17 నెలలు గా రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టని రైతు కుటుంబాలు లేవు అని చంద్రబాబు పేర్కొన్నారు. అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభ పెడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు.

అయితే మద్దతు ధర అడిగిన అన్నదాతల పై అక్రమ కేసులు, తమ భూములు లాక్కోవద్దు అని వేసుకున్న రైతుల పై తప్పుడు కేసులు, స్వచ్చందంగా రాజధానికి భూముల ఇచ్చిన రైతుల పై అక్రమ కేసులు అని, తాను అమ్మని ధాన్యానికి డబ్బులు తనకొద్దు అన్న నిజాయితీ కి వేదింపులు అంటూ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కాలంలో ఏ రాష్ట్రంలో అయినా రైతుల పై ఇన్ని అక్రమ కేసులు ఉన్నాయా అని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ను నిలదీశారు. అంతేకాక దళిత రైతుల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా అని, పురుగు మందు డబ్బాలతో, దళిత మహిళ లు తమ భూముల్లో పహర తిరగడం ఎప్పుడైనా చూసారా అని వరుస ప్రశ్నలు వేశారు.

అయితే ఫిర్యాదు దారుడు కేసు ఉప సంహరించుకున్న తర్వాత కూడా బేడీలు వేయడం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని తెలిపారు. సుప్రీం కోర్టు మార్గ దర్శకాలకు ఇది విరుద్దం అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు.