గన్నవరం టీడీపీకి కొత్త ఇంఛార్జ్.. ప్లాన్ మార్చిన చంద్రబాబు..!

Monday, September 28th, 2020, 12:12:37 PM IST

ఏపీలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఎట్టకేలకు కొత్త ఇంఛార్జ్‌ని నియమించింది. 2019 ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ సీఎం జగన్‌ని కలిసి మద్ధతు తెలపడంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధిష్టానం వంశీనీ సస్పెండ్ చేసింది.

అయితే అప్పటి నుంచి వల్లభనేని వంశీ టీడీపీపై, అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేశ్‌లపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. అయితే వంశీనీ ఎదురుకునేందుకు, అక్కడ వైసీపీనీ దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు నాయుడు గన్నవరం స్థానానికి కొత్త ఇంఛార్జ్‌ని నియమించారు. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి బాధ్యతలు అప్పగిస్తూ దీనికి సంబంధించి నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ఇంచార్జ్ పదవిని ఆశించినప్పటికి, ఆమె భర్త గద్దె రామ్మోహన్ ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండడంతో ఆమెకు ఇంఛార్జ్ బాధ్యతలు నిరాకరించినట్టు తెలుస్తుంది. అయితే మరో నేత రావి వెంకటేశ్వరరావు కూడా ఆశించినప్పటికి ప్లాన్ మార్చిన చంద్రబాబు చివరకి బచ్చుల అర్జునుడికి అవకాశం కల్పించారు.