తిరుపతి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. మరో ఎత్తుగడకు ప్లాన్..!

Tuesday, November 17th, 2020, 01:00:57 AM IST

ఏపీలో తిరుపతి లోక్‌సభకు త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది. ఇటీవల కరోనా బారిన పడి తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మృతిచెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. దీంతో అందరికంటే ముందుగానే ఆ స్థానానికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నికకు సిద్ధం కావాలంటూ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరును ఖరారు చేశారు.

అయితే 2019 ఎన్నికలలో పనబాక లక్ష్మీ టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకముందే చంద్రబాబు అభ్యర్థితత్వాన్ని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లుగా ఏడుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులని, మండలాల వారీగా కమిటీలు, వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌లను కూడా నియమించి పని ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఉప ఎన్నికలో టీడీపీ గెలిస్తే అది పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉందని, స్థానిక ఎన్నికలపై కూడా ఆ గెలుపు ప్రభావం ఉంటుందని, నేతల్లో, కార్యకర్తలలో మళ్లీ మునుపటి జోష్ వస్తుందన్న ప్లాన్‌తోనే అన్ని పార్టీల కంటే ముందుగానే చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారని తెలుస్తుంది. ఇక దుబ్బాకలో గెలిచినట్టుగా తిరుపతి ఉప ఎన్నికలో కూడా గెలుస్తామంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోపక్క అధికార వైసీపీ పార్టీ దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబానికే టికెట్ ఇస్తుందా? లేక వేరే అభ్యర్థిని నిలబెడుతుందా అనేది తెలియాల్సి ఉంది.