అలాంటి తప్పిదం ఈరోజు ఏపీలో జరుగుతోంది

Tuesday, January 26th, 2021, 09:18:43 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతీయులందరికీ 72 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని స్మరించుకుంటూ దేశం రిపబ్లిక్ డే వేడుకలను చేసుకుంటున్న వేళ, ఆంధ్ర ప్రదేశ్ లో అదే భారత రాజ్యాంగం పరిహసానికి, దిక్కారాణికి గురి అవుతుండటం బాధాకరం అని అన్నారు. అయితే అంబేడ్కర్ వంటి మేధావులు కష్టపడి రూపొందించిన రాజ్యాంగం ద్వారా, దేశ ప్రజలకు సంక్రమించిన స్వేచ్ఛ, హక్కులు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో హరించబడుతున్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

రాజ్యాంగం పరిధిలో ఏవైనా దోషాలు దొర్లితే అది రాజ్యాంగ లోపం కాదు అని, కచ్చితంగా మానవ తప్పిదమే అని అంబేడ్కర్ ఆనాడు చెప్పారు అంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాంటి తప్పిదం ఈరోజు ఏపీ లో జరుగుతోంది అని, ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ గౌరవాన్ని కాపాడుకోవడం దేశ పౌరులు గా మనందరి బాధ్యత అంటూ పిలుపు ఇచ్చారు. కాబట్టి ఈ విషయం లో ఐదు కోట్ల ఆంధ్రులు అంతా మళ్ళీ అలనాటి స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి తో రాజ్యాంగ రక్షణకి నడుం కట్టాలని కోరుతున్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.