కుప్పంలో కోట్ల రూపాయల డబ్బులు పంచారు – చంద్రబాబు

Thursday, February 18th, 2021, 03:06:40 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజక వర్గం అయిన కుప్పం లో పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 14 స్థానాలను గెలుచుకుంది. అయితే ఇంతటి పరాజయం పాలు అవ్వడం పట్ల చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు అధికార పార్టీ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో తాము గెలవక పోవడం కాదు అని, ప్రజాస్వామ్యం ఓడింది అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే డబ్బు పంపిణీ తో పాటుగా, అరాచకాల పై ఆధారాల పంపినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాలు అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకు అంటూ చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు.

అధికార పార్టీ నాయకులు తమతో మైండ్ గేమ్ ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక వైసీపీ కి ఓటు వేయని వారి పై దాడులు చేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ శాతం తెలుగు దేశం పార్టీ మద్దతు దారులే గెలిచారు అని వ్యాఖ్యానించారు. కుప్పంలో కోట్ల రూపాయల డబ్బులు పంచారు అని, కుప్పం తో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. అక్కడి ప్రజలు తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తారు అని, శాంతి కి మారుపేరు కుప్పం అని, అలాంటి ప్రాంతాన్ని కలుషితం చేస్తారా? కుప్పం ను మరొక పులి వెందుల గా మారుస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహ వ్యక్తం చేశారు.