సీఎం జగన్ కి లేఖ రాసిన చంద్రబాబు – దీంట్లో కూడా తప్పుడు లెక్కలేనా…?

Friday, April 3rd, 2020, 12:03:51 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఒక లేఖ రాశారు. కాగా గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భయంకరమైనకరోనా వైరస్ కారణంగా విలవిల్లాడుతుందని, కాగా ఈ వైరస్ సోకిన బాధితులకు సంబందించిన లెక్కల వివరాలను వైసీపీ ప్రభుత్వం దాచుతుందని, దయచేసి ఇప్పటికైనా నిజమైన లెక్కల వివరాలను అధికారికంగా ప్రకటించాలని కోరుతూ సీఎం జగన్ కు చంద్రబాబు ఓ లేఖను రాశారు. అంతేకాకుండా “రాష్ట్రంలోని కరోనా పాజిటివ్‌ కేసులను బయట పెట్టడంలేదు. కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల్లో వైరస్ కారణంగా చనిపోయినా ప్రభుత్వం బయటకు చెప్పడం లేదన్న వార్తలు వస్తున్నాయి. లెక్క తక్కువగా చూపుతున్నారన్న భావన ప్రజల్లో ఉంది. నిజాలను దాచిపెడితే పెనుప్రమాదం తప్పదు” అని చంద్రబాబు తన లేఖ ద్వారా వెల్లడించారు.

దానికితోడు ఈ వైరస్ మరింతగా విజృంభించకముందే కఠినమైన జాగ్రత్తలు, అవసరమైన చర్యలతో ఈ వైరస్ ని అరికట్టాలని,అందుకు గాను మరింతగా ఈ వైరస్ కి సంబందించిన వైద్య పరీక్షలు పెంచాలని, ఈ మహమ్మారీ సోకిన వారికీ ప్రత్యేకంగా చికిత్సాలయాలను పెంచాలని చంద్రబాబు తన లేఖ ద్వారా వెల్లడించారు. ఇకపోతే రాష్ట్ర ప్రజలందరికి కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలని, పేదలకు పౌష్టికాహారాన్ని అందించడానికి అన్న క్యాంటీన్లను కూడా వినియోగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.