ఏపీ రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

Tuesday, March 30th, 2021, 03:00:29 AM IST

ఏపీ రాష్ట్రాభివృద్ధి ప్రస్తుతం రివర్స్ గేర్‌లో నడుస్తుందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేడు ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు తెలుగుజాతి ఉద్ధరణ కోసమే ఎన్టీఆర్‌ టీడీపీ పార్టీనీ స్థాపించారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనని అన్నారు. పేదల పక్కా ఇళ్లకు 40ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. 9 నెలల్లో ప్రజాధరణ పొంది అధికారంలోకి వచ్చిన ఘనత టీడీపీ పార్టీదని అన్నారు.

అయితే ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, హైదరాబాద్‌లో తాము శ్రీకారం చుట్టిన జినోమ్ వ్యాలీలో నేడు కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనే వైఎస్, ఆ తర్వాత వచ్చిన సీఎంలు కొనసాగించారని అన్నారు. 40 ఏళ్లలో 21 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ అని, త్యాగాల కోసం పనిచేసే కుటుంబం లాంటి పార్టీ టీడీపీ అని అన్నారు. ఏదేమైనా ప్రస్తుతం వైసీపీ పాలనలో ప్రతి కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపారని, అన్ని ధరలు పెంచేసి సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి దాపురించిందని అన్నారు.