త్వరలో ఎన్నికలు రావడం ఖాయం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

Saturday, September 5th, 2020, 05:04:57 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకం అంటూ వైసీపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించడాన్ని రైతులందరూ వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు పోతుందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ని నగదు బదిలీ కిందకు మార్చడాన్ని ఎట్టి పరిస్థితులలో జరగనివ్వమని అన్నారు. మీటర్లు పెడితే మెట్ట ప్రాంత, రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

అయితే సీఎం జగన్ ప్రతి గంటకూ 9 కోట్ల అప్పు చేస్తున్నారని, తన అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాడని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రెండుసార్లు కరెంటు ఛార్జీలను పెంచారని, 18 లక్షల రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో ఏపీ ముందంజలో ఉందని కానీ వైసీపీ పాలనలో అది అడ్రస్ లేకుండా పోయిందన్నారు. వైసీపీ పాలన ఏ విధంగా ఉందనేది 15 నెలల్లోనే ప్రజలకు అర్ధమైపోయిందని అన్నారు. త్వరలోనే ఎన్నికలు రావడం ఖాయమని ఏ క్షణమైనా ఎన్నికలను ఎదురుకునేందుకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.