ఒకే రోజు రానున్న చైతు, సమంత….ఇంతకీ గెలుపెవరిది??

Tuesday, August 28th, 2018, 02:24:28 PM IST

ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత రూత్ ప్రభు, ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో కుర్రాళ్ళ మనసుదోచింది. అంతే కాదు ఆ చిత్రంతో ఏం మాయ చేసిందో తెలియదుకాని, అక్కినేని వారి అబ్బాయి మొదటి చూపులోనే ఆమెను ప్రేమించి, ఎట్టకేలకు ఇటీవల ఆమెను తన సతీమణిని చేసుకున్నాడు. అయితే పెళ్లి తరువాత కొంత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న సమంత, ప్రస్తుతం నటిస్తున్న చిత్రం “యూ టర్న్”.

కన్నడ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలయి చిత్రంపై మంచి ఆసక్తిని పెంచింది. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు నిర్మాతలు. ఇక ఆ విషయం అటుంచితే, మరోవైపు నాగ చైతన్య హీరోగా మారుతీ దర్శకత్వంలో రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం శైలజ రెడ్డి అల్లుడు. ఈ చిత్రం పాటలు ఇటీవల యూట్యూబ్ లో విడుదలయి మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే నిజానికి ఈ నెల 31న విడుదల కావలసిన ఈ చిత్రం కేరళలో రీ రికార్డింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అక్కడ వరదల కారణంగా విఘాతం కలగడంతో చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఒక వేళ శైలజ రెడ్డి అల్లుడు కూడా 13నే కనుక విడుదలైతే, అదే రోజున భార్యాభర్తలిద్దరూ నటించిన చిత్రాలు పోటీ పడడం ఖాయమని, ఎవరిని విజయం వరిస్తుందో అని సినీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా శైలజ రెడ్డి చిత్రం విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదని, ఖచ్చితంగా సెప్టెంబర్ 13నే విడుదలవుతుందా లేదా అనేది తెలియటానికి ఇంకొంత సమయం పడుతుందని, దీనికి సంబంధించి శైలజ రెడ్డి నిర్మాతలు త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం…..