సినిమా థియేటర్ల రీఓపెన్.. కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు..!

Tuesday, October 6th, 2020, 04:47:00 PM IST

అన్‌లాక్ 5.0 లో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లను రీఓపెన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమా థియేటర్లలో పాటించాల్సిన నియమాలపై కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 50% మించి థియేటర్లలోకి ప్రేక్షకులను అనుమతించరాదని, భౌతికదూరం పాటించాలని, ఖాళీగా వదిలేసిన సీట్లపై మార్కింగ్ వేయాలంది.

అంతేకాదు హాల్‌లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత కరోనా లక్షణాలు లేకపోతేనే లోపలికి అనుమతించాలని తెలిపింది. సినిమా హాళ్ళలో ప్రేక్షకులు ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని సూచించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ కౌంటర్లు రోజంతా ఓపెన్ చేసి ఉంచాలని, సినిమాకు ముందు మరియు విరామ సమయంలో కరోనా గురుంచి వీడియోలను ప్లే చేస్తూ ప్రేక్షకులలో అవగాహన కల్పించాలని సూచించింది. ప్యాకేజీ చేసిన ఆహారపానీయాలు మాత్రమే లోపలికి అనుమతించాలని తెలిపింది. అయితే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా థియేటర్ల నిర్వాహకులు పాటించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.