దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం కీలక నిర్ణయం..!

Tuesday, March 23rd, 2021, 07:04:09 PM IST

దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా నియంత్రణ కోసం గతంలో అమలు చేసిన చర్యలను మళ్లీ చేపడుతున్న కేంద్రం, వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్న డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు సహా ఇతర రంగాల వారికి కరోనా టీకా అందించింది.

అయితే వీరి తరువాత 60 ఏళ్లు పైడిన వారితో పాటు 45 ఏళ్లు పైబడి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి కేంద్రం వ్యాక్సినేషన్ అందిస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ కరోనా టీకా ఇవ్వఓతున్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అర్హులైన వారందరూ టీకా వేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు.