కేసీఆర్ అలా చెప్పడం వల్లే ఓటింగ్ శాతం తగ్గింది – కిషన్ రెడ్డి

Wednesday, December 2nd, 2020, 07:34:30 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. అయితే 45.97 శాతం మాత్రమే ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఇప్పటికే గ్రేటర్ వాసుల తీరు పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మరో కొన్ని చోట్ల బద్దకించిన వోటర్లు అని, మరొక చోట సిబ్బంది నిద్ర పోవడం వంటివి చూస్తే ఎవరికైనా కోపం రాక మానదు. అయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి కారణం కేసీఆర్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినందుకు తెరాస ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విద్వేషాలు జరుగుతాయి అని చెప్పడం వలనే ఓటింగ్ శాతం తగ్గింది అంటూ ఆరోపించారు. అంతేకాక ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం కుమ్మక్కు అయి ఎన్నికలు నిర్వహించారు అంటూ ఆరోపించారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరిపి ప్రభుత్వం వారిని అవమానించిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ను పెట్టడం తిరోగమన చర్య అంటూ కిషన్ రెడ్డి అన్నారు. అయితే తెరాస నేతలు కుట్రలు చేసి బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూశారు అని ఆరోపించారు. అయితే పోలింగ్ సరళి చూశాక గెలుస్తామని విశ్వాసం కలిగింది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.