బిగ్ న్యూస్: ఏపీ కి ప్రత్యేక హోదా పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Tuesday, March 23rd, 2021, 05:44:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయాక, పలు విషయాల్లో ఏపీ కి అన్యాయం జరిగింది అంటూ పలువురు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మొదటి నుండి కూడా ఊరిస్తున్న అంశమే. అయితే ఏపీ కి రాజధాని మరియు అభివృద్ది కొరకు గత తెలుగు దేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది కొరకు ప్రత్యేక ప్యాకేజి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎంపీ రామ్ మోహన్ నాయుడు అడిగిన ప్రశ్న కు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. 14 వ ఆర్ధిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి కూడా హోదా ఇవ్వడం లేదు అని తేల్చి చెప్పారు. ఏపీ కి ప్రత్యేక ప్యాకేజి తో పాటుగా,అనేక మినహాయింపు లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి అని, అవి తమ చేతుల్లో లేవు అంటూ చెప్పుకొచ్చారు. వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి అని వ్యాఖ్యానించారు.