ఎంపీ రఘురామకృష్ణం రాజుకు షాక్.. ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు..!

Thursday, October 8th, 2020, 05:04:07 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు పెద్ద షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఈ రోజు ఉదయం ఆరుగంటల నుంచి రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు, భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తుంది.

అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం 11 ప్రాంతాలలో సీబీఐ సోదాలు చేస్తుంది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు ఇతర బ్యాంకుల నుంచి ఎంపీ రఘురామకృష్ణం రాజు 826 కోట్ల రుణం తీసుకుని వాటిని చెల్లించలేదన్న కేసు నేపధ్యంలో సీబీఐ రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తుంది. ఇదేకాదు కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దానిని తమిళనాడులోని ట్యూటికోరన్‌కు తరలించారనే ఆరోపణలు కూడా రఘురామపై ఉన్నాయి.