సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టు కీలక నిర్ణయం..!

Monday, January 11th, 2021, 06:32:19 PM IST

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసులను విచారించాలని జగన్‌ తరపు లాయర్ కోరగా ఈ వాదనను సీబీఐ, ఈడీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని ఈడీ కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని కోర్టు తెలిపింది. ఈడీ వాదనతో కోర్టు కూడా ఏకీభవిస్తూ, ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడతామని తెలిపింది. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదుకు విచారణను కోర్టు ఈ నెల 21కి వాయిదా వేయిస్తున్నట్టు తెలిపింది.

ఇదిలా ఉంటే ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్‌తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకి కూడా ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా నేడు అమ్మవడి పథకం రెండో విడత ప్రారంభం, పలు ప్రభుత్వ కార్యక్రమాలలో సీఎం జగన్ బిజీగా ఉండడంతో కోర్టుకు హాజరుకాలేకపోయారని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలుపుతూ మినహాయింపు కోరారు.