అమితాబ్, అభిషేక్ లపై కేసు నమోదు!

Thursday, June 18th, 2015, 12:25:58 PM IST


బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అతని కుమారుడు యువ హీరో అభిషేక్ బచ్చన్ లపై ఘజియాబాద్ కోర్టులో కేసు నమోదైంది. ఇక వివరాల్లోకి వెళితే జాతిని అవమానించే రీతిలో జాతీయ పతాకాన్ని బచ్చన్ లు ఇద్దరూ తమ దేహానికి కప్పుకున్నారని చేతన్ దిమాన్ అనే వ్యక్తి జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిర్యాదు చేశాడు. ఇక ప్రపంచ కప్ లో భాగంగా ఫిబ్రవరి 15న జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో తండ్రీకొడుకులు ఇరువురు ఇలా జాతీయ జెండా కప్పుకుని కనిపించారని సదరు పిర్యాదుదారుడు పేర్కొనారు.

కాగా దీనిపై చేతన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ జెండాను అవమానకర రీతితో బచ్చన్ లు ధరించడం తన క్లయింటు, అతని స్నేహితులు చూసారని, ఒక పాపులర్ స్టార్లు అయి ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడడం దేశ ఖ్యాతిని తగ్గించేందుకు ప్రయత్నం చేసినట్లేనని తెలిపారు. అలాగే ఈ చర్య ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’, ‘ద ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002’ కిందకు వస్తుందని, కావున అమితాబ్, అభిషేక్ లకు తప్పకుండా సమన్లు జారీ చేస్తామని న్యాయవాది పేర్కొన్నారు.