నేటిఏపి స్పెషల్ : సీమాంధ్రలో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్ధులు

Saturday, May 17th, 2014, 06:15:03 PM IST


2014 సార్వత్రిక ఎన్నికలు సీమాంద్ర ప్రజలకు చాలా కీలకమైనవి. విభజన తర్వాత తెలంగాణ ప్రాంతంతో పాటుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను కూడా కేవలం 10 సవత్సరాలు ఉమ్మడిగా ఉపయోగించుకుని అటు తర్వాత కోల్పోబోతోంది సీమాంధ్ర ప్ర్రాంతం. మరి ఇలాంటి నేపధ్యంలో మొదటి నుండి రాష్ట్రాన్ని నిర్మించడానికి సమర్ధవంతమైన ప్రభుత్వం, ధీటైన నాయకుడు ఆ ప్రాంతానికి ఎంతైనా అవసరం. ఇదే నేపధ్యంలో ఎన్నికలు కూడా నిర్వహించడంతో ప్రజలు తమ తీర్పును తెలుగుదేశం పార్టీకి మద్దతుగా తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి పట్టు ఉండడంతో ఇరు పార్టీల మధ్య పోరు హోరాహొరీగా సాగింది. మొత్తానికి తెలుగుదేశమే తన ఆధిక్యతను తెలుపుకుంటూ అధికారంలోకి వచ్చింది. అయతే ఈ గెలుపులో సమీకరణాలన్నీ చిత్ర విచిత్రంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలోని భారీ మెజారిటీని నమోదు చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అధికారం దక్కకపోవడం కొసమెరుపు. మరి సీమాంధ్రలో ఏ పార్టీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో తమ ప్రత్యర్ధులపై గెలుపొందారో పరిశీలిద్దాము.

సీమాంధ్రలో భారీ మెజారిటీ పొందిన మొదటి ఐదుగురు అభ్యర్ధులు:
1. సీమాంధ్రలో భారీ మెజారిటీ సాధించినవారిలో మొదటగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రత్యర్ధి అయిన టిడిపినేత సతీష్ రెడ్డి పై 75,243 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు.
2. రెండవ స్థానంలో కర్నూల్ జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైకాపా నేత మణిగాంధీ తన ప్రత్యర్ధి భాజపా అభ్యర్ధి రేణుకమ్మ పై 52,384 ఓట్ల మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.
3. మూడవ స్థానంలో విశాఖపట్నం జిల్లా విశాఖతూర్పు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి వెలగపూడి రామకృష్ణబాబు తన సమీప ప్రత్యర్ధి వైకాపా నేత వంశీకృష్ణ శ్రీనివాస్ పై 48,300ల ఓట్ల భారీ మెజారిటీ సాధించారు.
4. నాల్గవ స్థానంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధి ఎస్విఎస్ఎన్ వర్మ తన ప్రత్యర్ధి వైకాపా నేత పెండెం దొరబాబు పై 48,080ఓట్ల ఆధిక్యతను సాధించారు.
5. ఇక ఐదవ స్థానంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్ధి వైకాపా నేత చంద్రమౌళి రెడ్డి పై 47,121 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

సీమాంధ్ర ప్రాంతంలోని ప్రజలు విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పై కత్తి కట్టడంతో మెజారిటీ ఓట్లన్నీ టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకే దక్కాయి. అయితే ఫలితాలలో భారీ మెజారిటీ సాధించిన జగన్ కి అధికారం దక్కకపోగా ఐదవ స్థానంలో ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రాంతానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరి బాబు పాలనలో ఆంద్రప్రదేశ్ తిరిగి తన ప్రాభవాన్ని గడిస్తుందని ఆశిద్దాం.