ఆ రోజే కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడిని.. బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు..!

Saturday, March 6th, 2021, 07:09:00 PM IST

విజయవాడ టీడీపీలో నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. గత కొద్ది రోజులుగా పార్టీకి చెందిన నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో కేశినేని నాని వ్యతిరేక వర్గం నేడు బొండా ఉమా నివాసంలో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కేశినాని నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నానితో తాము విసిగిపోయి మీడియా ముందుకు వచ్చామని అన్నారు. చంద్రబాబును ఏక వచనంతో సంబోధించడం, చిటికెలు వేసి విజయవాడకు తానే అధిష్టానం అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అయితే కేశినేని అహంకారాన్ని చూసి ఆ రోజు తాను చెప్పుతో కొట్టాలనుకున్నానని కానీ చంద్రబాబుపై ఉన్న గౌరవంతో ఆ పని చేయలేదని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు. రంగా హత్య కేసులో ముద్దాయిని కేశినేని ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నారని, టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తాను ఇకపై విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా ఉంటానని, 2024లో తానే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.