టీడీపీ ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం.. బుద్ధా వెంకన్న హెచ్చరిక..!

Saturday, October 3rd, 2020, 06:45:14 PM IST

ఏపీలో వైసీపీ నేతలు మితిమీరి మాట్లాడుతూ, హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వారందరికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. మంత్రి పదవిలో ఉండి మాజీ ముఖ్యమంత్రిపై ధర్మాన మాట్లాడిన మాటలు ఆయనకే వర్తిస్తాయని, వెధవలకు పదవులిస్తే ధర్మానలానే మాట్లాడతారని విరుచుకుపడ్డారు. దేవుడున్నాడని పదేపదే చెప్పే జగన్‌కు రాబోయే ఎన్నికలలలో ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యే మిగులుతుందని జోస్యం చెప్పారు.

అయితే ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నాడన్న కోపంతో సబ్బంహరి ఇంటి గోడను కూల్చారని అన్నారు. అయితే అవినీతి పునాదులపై కట్టిన జగన్ ఇంటిన్ ముందు కూల్చండని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తూ, టీడీపీ నేతలను తిడితే సాక్షి మీడియాలో బాగా చూపిస్తారని నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక కేసులు మాఫీ చేయించుకోవడానికే విజయసాయిరెడ్డి ఎంపీ అయ్యాడని, ఆయనలాంటి నేరస్థులు రాజ్యసభకు వెళ్లబట్టే పెద్దల సభ ప్రతిష్ట దెబ్బతిందని అన్నారు.