పాలన చేతగాక ప్రభుత్వ భూములపై పడ్డారు.. బోండా ఉమా కీలక వ్యాఖ్యలు..!

Monday, November 9th, 2020, 01:36:33 PM IST

వైసీపీ సర్కార్ ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు, విశాఖ జిల్లాలలో కోట్ల ధర పలికే భూములను వైసీపీ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే బిల్డ్ ఏపీ మిషన్‌ మరియు పలు శాఖలకు చెందిన భూములను వేలం వేసేందుకు సిద్దమయ్యింది. విశాఖలో పరిశ్రమల స్థాపన, గుంటూరులో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి ఉద్దేశించిన భూములను సర్కారు వేలం ద్వారా అమ్మబోతోంది.

అయితే దీనిపై స్పందించిన టీడీపీ నేత బోండా ఉమా ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రభుత్వ భూములను అమ్మడం సర్కార్ దివాలకు నిదర్శనమని అన్నారు. బహిరంగ వేలం పేరుతో ప్రభుత్వ స్థలాలను వైసీపీ కొట్టేయాలని కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇలా ఇష్టమొచ్చినట్టు అమ్ముకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సెంటు భూమి కూడా మిగలదని అన్నారు. వైసీపీకి పాలన చేతగాక ప్రభుత్వ స్థలాలపై పడిందని ఎద్దేవా చేశారు.