ఆ ఆరోపణలకు వైసీపీ క్షమాఫణ చెప్పాలి.. బోండా ఉమా డిమాండ్..!

Thursday, September 17th, 2020, 05:22:01 PM IST

టీడీపీ నేత బోండా ఉమా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతిపై వైసీపీ చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిలో 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ చెబుతుందని, మరి అవినీతి జరిగిందని చెబుతూ ఈ 15 నెలల వ్యవధిలో ఏం పట్టుకున్నారో చెప్పాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడవకముందే వారి అవినీతి, అసమర్ధత ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు.

అయితే అభివృద్ధి పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నా దాని వెనుక కారణం అది కాదని కేవలం అమరావతిని నాశనం చేయటానికే వికేంద్రీకరణ బిల్లు తెచ్చారని మండిపడ్డారు. అయితే పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రోజుకో అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మరలిస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన ఈ 15 నెలల్లోనే లక్ష కోట్లు అప్పుచేసిందని అన్నారు. అయితే ఆ లక్ష కోట్లు కోట్లు కూడా ఏమయ్యాయో ఎవరికీ తెలీడం లేదని అన్నారు.