ఇళ్లపట్టాల పంపిణీలో అంతులేని అవినీతి.. బోండా ఉమా సీరియస్ కామెంట్స్..!

Tuesday, September 29th, 2020, 01:42:27 PM IST

ఏపీలో వైసీపీ నేతలు ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో భారీ అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. 4వేల కోట్ల వరకు దోపిడీ జరిగితే ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇళ్ళ పట్టాలను పేదలకు అందనివ్వకుండా టీడీపీ కోర్టులకు వెళ్ళిందని వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

అయితే ఏ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీని టీడీపీ అడ్డుకుందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని అవినీతిని చూడలేక అధికారపార్టీకి చెందినవారే హైకోర్టుని ఆశ్రయించారని ఎద్దేవా చేశారు. అనపర్తి నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ, వైసీపీ నేత కత్తి భగవాన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయలేదా అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అవినీతిపై కలెక్టర్‌కు లేఖ రాసింది నిజం కాదా అని నిలదీశారు. ఇళ్లస్థలాల అవినీతి బాగోతంలోని నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు టీడీపీ తరుపున త్వరలోనే నిజనిర్ధారణ కమిటీ వేయబోతున్నట్టు బోండా ఉమా తెలిపారు.