బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం సక్సెస్ అయ్యినట్టేగా..!

Sunday, December 6th, 2020, 01:30:56 AM IST

గ్రేటర్‌లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం సక్సెస్ అయ్యిందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి కేటీఆర్‌ అన్నీ తానై ప్రచారం నిర్వహించగా, బీజేపీ మాత్రం లోకల్ లీడర్లతో పాటు పలువురు దిగ్గజాలను కూడా రంగంలోకి దింపింది. రాష్ట్రానికి చెందిన నేతలైన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అరవింద్‌, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌, డీకే అరుణ వీరందరూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

అయితే వీరితో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ప్రకాశ్‌ జావడేకర్‌, స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య వంటి నేతలు ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. వారు నిర్వహించిన రోడ్‌షోలు, ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా, వారిని బీజేపీ ఓటు బ్యాంక్‌గా మార్చుకోగలిగారు. దీంతో 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో కేవలం 4 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ, ఈ సారి ఏకంగా 48 సీట్లతో రెండో స్థానంలో నిలిచి కారు జోరుకు కళ్ళెం వేసింది.