జగన్‌ ప్రధాని అయినా ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు – సుజనాచౌదరి

Monday, February 1st, 2021, 10:11:58 PM IST


ఏపీ ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాట్లాడిన సుజనా చౌదరి జగన్‌ ప్రధాని అయినా ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. జగన్ తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకే ఢిల్లీ టూర్‌లకు వెళ్తున్నారు తప్పా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని మండిపడ్డారు. జగన్‌ ఢిల్లీ వచ్చి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని సుజనాచౌదరి అన్నారు.

అయితే కేంద్రం అన్ని రంగాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ప్రవేశపెడితే ఎన్నికల బడ్జెట్ అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో ఎక్కడ మౌలిక సదుపాయాలు కల్పించారో చెప్పాలని సుజనాచౌదరి డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీలో మంజూరు చేసిన 20 వేల కోట్లను కూడా తెచ్చుకోవడం రాష్ట్ర నేతలకు సాధ్యం కాలేదని, ఇక పోలవరానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిన అవసరం లేదని సుజనాచౌదరి అభిప్రాయపడ్డారు.