విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..!

Wednesday, March 10th, 2021, 10:00:43 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు సీఎం జగన్‌తో సుబ్రమణ్య స్వామి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సుబ్రమణ్య స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని, అసలు ప్రైవేటీకరణ అంశం తన దృష్టికి రాలేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడం కరెక్ట్‌ కాదని అన్నారు.

అంతేకాదు గతంలో ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణను కూడా తాను వ్యతిరేకించినట్టు చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధానిని సీఎం జగన్ కలిసేటప్పుడు తాను కూడా ఆయన వెంట వెళ్తానని స్పష్టం చేశారు. టీటీడీపై తెర వెనుక ఉండి చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారని, వెంకన్న భక్తునిగా ఈ దుష్ప్రచారం విషయంలో తాను చాలా బాధ పడ్డానని సుబ్రమణ్య స్వామి అన్నారు. టీటీడీ అకౌంట్లను రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా కాగ్ తో ఆడిట్ చేయించాలన్న సీఎం నిర్ణయం చాలా మంచి పరిణామమని అన్నారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డితో తనకు అనేక సంవత్సరాలు నుండి పరిచయముండేదని, ఈ రోజు జగన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని సుబ్రమణ్య స్వామి చెప్పుకొచ్చారు.