మంత్రి హరీశ్‌రావుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు..!

Thursday, October 22nd, 2020, 07:04:32 PM IST

దుబ్బాక ఉప ఎన్నికలో రాజకీయం మరింత వేడెక్కింది. అయితే గెలుపు మాదంటే మాదని ఒక పార్టీపై మరో పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తమ సిట్టింగ్ స్థానాన్ని మరింత భారీ మెజారిటీతో గెలిపించుకుని ప్రత్యర్ధి పార్టీలకు బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈ ఎన్నికలలో గెలిచి రానున్న ఎన్నికలలో తమదే అధికారం అని చెప్పుకోవాలని కాంగ్రెస్, బీజేపీ తహతహలాడుతున్నాయి.

అయితే నేడు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంత్రి హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయం లేచిన వెంటనే మంత్రి హరీశ్‌రావు కలెక్షన్లు చేసి సాయంత్రం కాగానే నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవితకు, ఎంపీ సంతోష్ కుమార్‌కు పంపకాలు చేస్తారంటూ ఆరోపణలు చేశారు. దుబ్బాక ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని నల్లికుట్ల కుటుంబంగా భావిస్తున్నారని, ఇక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపించి టీఆర్ఎస్ పార్టీని వైకుంఠదామానికి పంపించాలని దుబ్బాక ప్రజలకు ఎంపీ అరవింద్ పిలుపునిచ్చారు.