గ్రేటర్ ఎలక్షన్స్: నగరవాసులకు అదిరిపోయే హామీలు ప్రకటించిన బీజేపీ..!

Thursday, November 19th, 2020, 05:42:17 PM IST

గ్రేటర్ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియను దాదాపు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రచారానికి సన్నద్ధమైన అన్ని పార్టీలు నగరవాసులపై హామీల జల్లులు కురిపిస్తున్నాయి. అయితే దుబ్బాక గెలుపుతో పుల్ జోష్ మీదున్న బీజేపీ జీహెచ్ఎంసీలో కూడా తమ సత్తా నిరూపించుకోవాలని తహతహలాడుతుంది. ఈ క్రమంలో బీజేపీ గ్రేటర్ వాసులకు అదిరిపోయే హామీలను ప్రకటించింది. బీజేపీని గెలిపిస్తే వరద బాధితులకు 10 వేలు కాదు.. 20 వేలు వరద సాయం అందిస్తామని ప్రకటించింది.

అంతేకాదు వరద నీతిలో మునిగి పాడయిన కార్లు, బైక్‌లు స్థానంలో కొత్తవి ఇప్పిస్తామని, ఇళ్లు కూలిపోయిన వారికి కొత్త ఇల్లు కట్టిస్తామని వెల్లడించింది. ఇంటి లోపలికి వరద నీరు వచ్చిన వారికి కొత్త ఫర్నిచర్ అందజేస్తామని తెలిపింది. ఇదే కాకుండా నగరవాసులందరికీ ట్రాఫిక్ చలాన్లు మాఫీ చేస్తామని, జీహెచ్ఎంసీ నుంచే చలాన్లు కట్టేలా చొరవ తీసుకుంటామని పేర్కొంది. ఇక ఎల్‌ఆర్ఎస్‌ను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు.