వాటిని కూడా సమర్ధిస్తారా…కేసీఆర్ కి విజయశాంతి సూటి ప్రశ్న

Wednesday, December 9th, 2020, 10:33:17 AM IST

రైతుల పక్షాన నిలబడి భారత్ బంద్ లో పాల్గొన్న తెరాస పై, సీఎం కేసీఆర్ తీరు పై బీజేపీ నేత, నటి విజయశాంతి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలు చేపట్టిన బంద్ లో చివరి క్షణం లో ఎంట్రీ ఇచ్చి మొత్తం క్రెడిట్ ను హైజాక్ చేయాలని సీఎం కేసీఆర్ తెగ ఆరాటపడ్డారు అని అన్నారు. అయితే ఆయన ఎత్తుగడలు జీర్ణించుకోలేక కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలు కొత్త వ్యూహం తో తెరాస సర్కార్ పై పోరాటానికి సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి అని విజయశాంతి చెప్పుకొచ్చారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన బంద్ చేశామని చెబుతున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు త్వరలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాల పై ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే దీని ద్వారా కేసీఆర్ ను ఇరకాటం లో పెట్టాలని వారి వ్యూహం అని అన్నారు. రైతుల పై కపట ప్రేమ ఒలకబోస్తూ కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీల బంద్ పిలుపు నకు మద్దతు ఇచ్చిన కేసీఆర్ గారు, మరి ఆ పార్టీలు తెలంగాణ లో చేసే ఆందోళన లని సమర్ధిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. రైతు బంధువు అని చెప్పుకొని, ఫాం హౌస్ రాజకీయాలతో రాబందులా వ్యవహరించే సీఎం దొరగారి నిజ స్వరూపం తెలియడం వల్లే ఆయన తుపాకీ రాముడు మాటలను నమ్మలేక దుబ్బాక ఓటర్లు బీజేపీ కి కట్టబెట్టారు అని తెలిపారు. త్వరలో తెలంగాణ లోని మిగిలిన రైతులు కూడా కేసీఆర్ గారి సర్కారు పై తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.