బ్రేకింగ్: టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నేత శ్రీధర్‌ రెడ్డి..!

Monday, November 2nd, 2020, 03:43:16 PM IST

తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్‌కు, బీజేపీకి మద్య తీవ్ర మాటల యుద్దం నడుస్తుంది. అయితే రేపు జరగనున్న దుబ్బాక ఎన్నికలో గెలుపు తమదే అని చెప్పుకుంటున్న బీజేపీకి షాక్ ఇచ్చేలా మరియు బల్దీయా ఎన్నికలలో మరింత పట్టు సాధించేలా టీఆర్ఎస్ వ్యూహాన్ని రచించింది. బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంది. అయితే గత ఎన్నికలలో శ్రీధర్ రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయినా పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ ప్రత్యర్థి పార్టీల నేతలపై విరుచుకుపడేవారు.

అయితే నిన్న మొన్నటి వరకు కూడా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు డబ్బుల వ్యవహారంపై స్పందిస్తూ అధికార పార్టీపై విమర్శలు కురిపించారు. అయితే బీజేపీలో తాను 11 సంవత్సరాలుగా ఉన్నానని, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న సడెన్‌గా శ్రీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఒకింత షాక్‌కు గురయ్యారు. అంతేకాదు నేడు మంత్రి కేటీఆర్ స‌మక్షంలో శ్రీధ‌ర్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కూడా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో తాను వివిధ స్థాయిల్లో పనిచేశానని, కానీ బీజేపీ కల్లిబొల్లి మాటలు, అబద్దాల ప్రచారంతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని చెప్పుకొచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.