ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకు అదే కారణం – రామచంద్రరావు

Monday, March 22nd, 2021, 05:24:01 PM IST

పట్ఠభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకు పీఆర్సీనే కారణమని బీజేపీ నాయకుడు రామచంద్రరావు ఆరోపణలు చేశారు. నేడు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌తో భేటీ అయిన రామచంద్రరావు పీఆర్సీపై లీకులిచ్చి ఉద్యోగులతో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేయించుకుందని ఆయన అన్నారు. దొంగ సర్టిఫికేట్స్‌తో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించారని చెప్పుకొచ్చారు. గూగుల్ పే, పేటీఎంల ద్వారా ఓటర్లకు డబ్బుల పంపిణీ జరిగిందని అన్నారు. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగంపై సీబీఐ విచారణ కోరినట్టు రామచంద్రరావు తెలిపారు.

ఇదిలా ఉంటే నేడు ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులందరికీ జీతాలు పెంచుతున్నట్లు తెలిపారు. అంతేకాదు ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ను ఇస్తున్నామని ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అన్నారు. అర్హులైన ఉద్యోగులందరికీ త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును కూడా 61 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు.