టీఆర్ఎస్‌లో చేరికపై వెనక్కి తగ్గిన నివేదితారెడ్డి.. కారణం అదే..!

Wednesday, March 31st, 2021, 10:13:22 PM IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ వరుస షాక్‌ల నుంచి తప్పించుకుంది. టికెట్ ఆశించిన నేతలను పక్కన పెట్టి చివరి నిమిషంలో అనూహ్యంగా డాక్టర్ రవికుమార్ నాయక్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ కీలక నేత కడారి అంజయ్య టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో నిన్న ఆయన టీఆర్‌ఎస్‌‌లో చేరారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన నివేదితారెడ్డి ఈ సారి కూడా తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో బీజేపీ కండువా లేకుండానే ఆమె ముందస్తుగా నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే తనకు టికెట్ రాకపోవడంతో నివేదితారెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఆమెను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవాలని గులాబీ పార్టీ విశ్వప్రయత్నాలు చేసింది. ఆమె కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే టీఆర్ఎస్‌లో చేరే అంశాన్ని ఆమె విరమించుకున్నట్టు తెలుస్తుంది. మరో ముఖ్య నేత కడారి అంజయ్య టీఆర్ఎస్‌లో చేరడంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో తనకే సాగర్ టికెట్ దక్కుతుందని భావించిన నివేదితారెడ్డి పార్టీ మారకూడదని అనుకున్నట్టు తెలిసింది.