గ్రేటర్ ఎన్నికల కోసం రూ.10 వేల వరద సాయం ప్రకటించారు

Tuesday, December 22nd, 2020, 02:58:02 PM IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుబ్బాక ఉపఎన్నిక తో మార్పు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బీజేపీ తెలంగాణలో పుంజుకోవడం పట్ల ఆ పార్టీ కి చెందిన కీలక నేత మురళీ ధర రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సాధారణ పరిపాలన ఆగిపోయింది అని, ఎన్నికలే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి అని అన్నారు. దుబ్బాక గెలుపు తర్వాత తెరాస కి మూర్ఛ వచ్చినంత పని అయింది అని అన్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసమే వరద సాయం 10 వేల రూపాయలను ప్రకటించారు అని ఆరోపించారు.

అయితే ఎన్నికలు పూర్తి అయిన తర్వాత వరద సాయం ప్రారంభించ లేదు అని తెలిపారు. అయితే ఎన్నికలు వస్తేనే ప్రజా సంక్షేమం గుర్తుకు వస్తుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. వరంగల్ లో కూడా వరదలు వచ్చాయి అని, అక్కడ ఎన్నికలు లేవు అని వరద సాయం పంపిణీ చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రైవేట్ ఉపాద్యాయులు రోడ్డున పడ్డారు అని, వారిని పట్టించుకోలేదు అని, ఇప్పుడు పట్ట బద్రుల ఎన్నికలు వస్తున్నాయి అని, అందుకే ఉద్యోగాలను ప్రకటించారు అని పేర్కొన్నారు. అయితే బీజేపీ ను ఎదుర్కోలేక తెరాస ఎన్నికల జిమ్మిక్కులు చేస్తోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాం లాంటి కేసీఆర్ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించాల్సిన అవసరం ఉందని, తెలంగాణ లో అధికారం లోకి రాబోయే బీజేపీ యే అంటూ పేర్కొన్నారు.