సీఎం కేసీఆర్‌ను నమ్మవద్దు.. బీజేపీ నేత బాబూమోహన్ కీలక వ్యాఖ్యలు..!

Friday, October 16th, 2020, 05:20:14 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ నేత, సినీనటుడు బాబూమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ప్రచారం నిర్వహించిన బాబూమోహన్ దుబ్బాకకు సీఎం కేసీఆర్ ఏమీ చేయరని ఆయన ఎవరికి కనిపించని కరోనాలాంటి వాడని అన్నారు. దుబ్బాక ప్రజల సమస్యలు తీరాలంటే బీజేపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

అయితే మల్లన్నసాగర్ ముంపు బాధితుల సమస్యలు తీరాలంటే బీజేపీని గెలిపించాలని, అప్పుడు ఈ సమస్య తీర్చేందుకు రఘునందన్ రావు నేరుగా ప్రధాని మోదీ దగ్గరకే వెళ్ళి మాట్లాడతారని అన్నారు. గజ్వేల్, సిద్ధిపేటను అభివృద్ధి చేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులను మంత్రి హరీశ్ రావు ఎన్ని ఇబ్బందులకు గురిచేశాడో తనకు తెలుసని, ఇప్పుడు మాయామాటలు చెప్పి దుబ్బాక ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్లెవరూ ఇప్పుడు సీఎం కేసీఆర్ వెంబడి లేదని, అప్పుడు ఆయనను తిట్టిన వారే ఇప్పుడు మంచి పదవులలో ఉన్నారని అన్నారు. ప్రజలను పట్టించుకోని టీఆర్ఎస్‌ పార్టీనీ, ఎన్నికల ముందు టికెట్ కోసం పార్టీ మారిన కాంగ్రెస్ నాయకుడిని నమ్మవద్దని మీ కోసం పోరాడే బీజేపీ నేత రఘునందన్ రావును గెలిపించుకోండని పిలుపునిచ్చారు.