తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది.. బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..!

Monday, August 10th, 2020, 04:14:34 PM IST

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు నేడు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొన్న జేపీ నడ్డా కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డారు.

తెలంగాణ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని, గడిచిన ఈ ఆరేళ్లలో తెలంగాణ ప్రజలకు చేసిందేంటో కేసీఆర్ చెప్పాలని,తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50 వేల ఇళ్లు కూడా కట్టలేదని అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమయ్యిందని, హైకోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసినా మారడం లేదని అన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారని అన్నారు. కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని చెప్పుకొచ్చారు.