తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ.. జనసేన మద్ధతు..!

Friday, March 12th, 2021, 07:45:23 PM IST

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ, జనసేన తరపున ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ఆ పార్టీ నేత మురళీధరన్ ప్రకటించారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని చెప్పుకొచ్చారు. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి తీసుకున్న నిర్ణయమని, తిరుపతి నుంచే బీజేపీ విజయయాత్ర మొదలవుతుందని అన్నారు.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల నుంచి తిరుపతి ఉప ఎన్నికలో తామే పోటీ చేస్తామని, అక్కడ బీజేపీ కంటే జనసేనకు ఎక్కువ బలం ఉందని అవసరమైతే దీనిపై ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసి ఒప్పిస్తామని జనసేన ప్రకటిస్తూ వస్తుంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ఇంచార్జ్ సునీల్ డియోదర్‌లు సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం బీజేపీ పోటీ చేయాలని, జనసేన మద్ధతు తెలపాలని నిర్ణయించాయి. ఇప్పటికే టీడీపీ తరపున కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ బరిలోకి దిగడం ఖాయం కాగా, వైసీపీ తరపున గురుమూర్తి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే త్వరలోనే బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.